- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- కల్వకోల్, కుడికిళ్లలో సబ్ స్టేషన్ల ప్రారంభం
సారథి, కొల్లాపూర్: రాష్ట్రంలో వ్యవసాయానికి లోవోల్టేజీ సమస్య అధిగమించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. లైన్‌మెన్ స్థాయి నుంచి సీఎండీల వరకు చేసిన కృషి కారణంగానే విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించామని మంత్రి స్పష్టంచేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి సింగోటం శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు.
బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలించిన మంత్రి
అనంతరం సింగోటం శ్రీవారిసముద్రం(బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ను మంత్రి పరిశీలించారు. సింగోటం, కాల్వకోల్ గ్రామాలకు ఇబ్బంది కలగకుండా రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన కోరారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్.శర్మన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.