సారథి, చొప్పదండి: నియోజకవర్గ అభివృద్ధి కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్నేతలు హితవు పలికారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ సోమిడి శ్రీనివాస్, భక్తు విజయ్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ కనుమల్ల రాజశేఖర్ తదితరులు చొప్పదండిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. దళితబంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ఒక్కింటికి రూ.10 లక్షలు రావాలంటే హుజూరాబాద్ మాదిరిగా చొప్పదండిలో ఉపఎన్నిక వస్తేనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన పైలెట్ ప్రాజెక్ట్ దళితబంధు మంచి కార్యక్రమమని, కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే చేస్తున్నారా?అని ప్రశ్నించారు. దళితబంధును రాష్ట్రమంతా అమలుచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు ముద్దం తిరుపతి గౌడ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రమేష్ గౌడ్, కౌన్సిలర్లు అశోక్, పెరుమాండ్ల మానసా గంగయ్య, మండల ఉపాధ్యక్షుడు సంభోజి సునీల్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోల సంపత్, కల్లేపల్లి ప్రేమ్ కుమార్, కార్యదర్శి గుండేటి విజయ్, బుచ్చి లింగం, బండారు అఖిల్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బండారు రాజేష్, ఎగుర్ల కర్ణాకర్ పాల్గొన్నారు.