- ‘మల్లు ఫ్యామిలీ’ మాదిగలకు ముల్లులా తయారైంది
- కాంగ్రెస్ నేత సతీశ్మాదిగ హాట్ కామెంట్స్
సామాజికసారథి, మహేశ్వరం: కాంగ్రెస్‌పార్టీలో మాల సామాజికవర్గానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్‌నేత దేవని సతీశ్మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే గాంధీభవన్ముందు కాంగ్రెస్‌పార్టీ మాదిగల ఆవేదన దండోరా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీల కమిటీల్లో మాదిగలకు స్థానం కల్పించాలని కోరారు. కమిటీల్లో అన్యాయం చేస్తున్నారని, మాలలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీలో ‘మల్లు ఫ్యామిలీ’ మాదిగలకు ముల్లులా తయారైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పదవులకు అడ్డొచ్చిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మీడియాతో మాట్లాడిన విషయాలు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాకు భూములు ఇచ్చింది.. బతుకు దెరువు చూపింది. అన్నివర్గాల ప్రజలకు హక్కులను ప్రసాదించేలా భారతరత్న డాక్టర్‌బీఆర్ అంబేద్కర్‌ను రాజ్యాంగం రాసేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. పేదల వాళ్లకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. ఆ కృతజ్ఞతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నాం.. జెండాను మోస్తున్నాం. కానీ పదవులను మాత్రం మాదిగలకు ఇవ్వడం లేదు. మాల సోదరులకు మాత్రమే ఇస్తున్నారు. మా జనాభా నిష్పత్తి ప్రకారం పదవులు అడుగుతున్నాం. అయినప్పటికీ ఈ విషయాన్ని రోడ్ల మీద వేయడం లేదు. కానీ మాకు సామాజిక న్యాయం జరగాల్సిందే.
రాష్ట్రంలో ఉన్న 19 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 స్థానాలను మాదిగలకు మాత్రమే ఇవ్వాలి. మూడు పార్లమెంట్‌స్థానాల్లో రెండు పార్లమెంట్స్థానాలను మాదిగలకే కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో 30వేల నుంచి 70వేల వరకు మాదిగల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మాదిగలకు స్థానాలను కేటాయించకపోతే మిగతా జనరల్ స్థానాల్లో సహకరించబోం. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడినాం. మొదటిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ మా సామాజికవర్గానికి చెందిన తాటికొండ రాజయ్యకు మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చారు. మళ్లీ బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇచ్చారు. వారికి ఇస్తూనే మాదిగలకు కూడా ఇవ్వాల్సి ఉంది. తెలంగాణలో దాదాపు 50లక్షల మాదిగల జనాభా ఉంది. మాలలు 15లక్షల మంది మాత్రమే ఉన్నారు. అన్నివర్గాలకు సామాజిక న్యాయం జరగాలి.”అని సతీశ్మాదిగ అన్నారు. సమావేశం లో బక్క జెడ్సన్, కొండేటి మల్లయ్య, ముంజగాళ్ల విజయ్, బాకీ జూనీ తదితరులు పాల్గొన్నారు.