- పేదల సేవలో తూడుకుర్తి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి
- ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి 10 ఎకరాల భూదానం
- ఆస్పత్రిని ఏర్పాటుచేసి 24 వసంతాలు పూర్తి
సామాజికసారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటారు. అన్ని అవయవాల్లో కన్నా కళ్లు ముఖ్యమైనవి అని అర్థం. చూపు లేనిది ప్రపంచమే అంధకారం. అలాంటి కళ్లకు ఏమైనా జబ్బు చేస్తే వెంటనే మనం ఆసుపత్రికి వెళ్తాం. కానీ చికిత్స చేసే ఆసుపత్రులు పల్లెటూర్లలో చిన్న చిన్న పట్టణాలలో కనిపించవు. కన్నుకు ఏమైనా అయితే పట్నంలో వెళ్లి చూపించుకోవాలనే నానుడు ఉండే. కానీ ఆ గత పరిస్థితికి ముగింపు పలికారు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు. మారుమూల గ్రామీణప్రాంతాల్లో కూడా ప్రజలందరికీ కంటి చికిత్స అందిస్తూ వైద్యం అంటే వ్యాపారం కాదు.. సామాజికసేవ అని రుజువు చేశారు యాజమాన్యం, సిబ్బంది. సరిగ్గా 1998 అక్టోబర్ 24న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి 12 కి.మీ.దూరంలో ఉన్న తూడుకుర్తి గ్రామంలో 10 ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇక్కడికి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి ఆసుపత్రి వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. నేటికి ఆస్పత్రి 24 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన వేడుకల్లో నాగర్కర్నూల్జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, యువనాయకుడు, ఎమ్మెల్సీ తనయుడు డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆస్పత్రి సేవానిరతిని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం మాదిరిగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన శస్త్రచికిత్సలు కూడా చేస్తారు. ఇక ఫీజు విషయానికి వస్తే తెల్లరేషన్ కార్డు ఉంటే ఉచితంగా వైద్యసేవలు అందిస్తారు. ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారు. మిగిలిన వారి కూడా నామినల్ గా ఫీజులు తీసుకొని కార్పొరేట్ వైద్య స్థాయిలో సేవలు అందిస్తున్నారు. మారుమూల పల్లెటూరులో స్థాపించిన ఈ ఆస్పత్రికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి రోజుకు 100 పైగా పేషెంట్లు అవుట్ పేషెంట్ గా సేవలు పొందుతున్నారు. 10మంది వరకు అందులో ఆపరేషన్ సేవలు పొందుతున్నారు. ఇప్పటివరకు 3,56,190 కంటి పరీక్షలకు వచ్చారు. ఇందులో 42,472 మందికి కంటి శస్త్రచికిత్సలు చేశారు. ఇందులో 27,663 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం తమ ఔదార్యాన్ని చాటుకుంది.
‘కూచకుళ్ల’ గొప్పగుణం
మారుమూల ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ యాజమాన్యానికి స్థానిక ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తన 10 ఎకరాల భూమిని ఉచితంగా ఆస్పత్రి నిర్మాణం కోసం ఇవ్వడంతో ఇక్కడ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. భూమి ఉచితంగా ఇచ్చిన దాత ఆయన దామోదర రెడ్డి తండ్రి కూచకుళ్ల రామచంద్రారెడ్డి నేత్రశాలగా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నామకరణం చేశారు.