Breaking News

దళిత యువకుడి కాళ్లు విరగ్గొట్టారు

దళిత యువకుడి కాళ్లు విరగ్గొట్టారు
  • భూవివాదం కేసులో నల్లగొండ టూ టౌన్​పోలీసుల ఓవరాక్షన్​
  • సోషల్​మీడియాలో వైరల్​గా మారిన ఘటన
  • ఉదంతంపై విచారణకు ఆదేశించిన ఎస్పీ రంగనాథ్​
  • విచారణ అధికారిగా డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఓ కేసు విషయంలో ఓ దళిత యువకుడిని పోలీసులు విచారణ పేరుతో నల్లగొండ టూ టౌన్​పోలీస్ స్టేషన్​కు పిలిచి చితకబాదారు. ఈ ఘటనలో అతని కాలు విరిగింది. ఉదంతం కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదివారం తెలిపారు. భూవివాదంలో ఎస్సై జోక్యం చేసుకున్నాడని, దళిత యువకుడిపై విచక్షణారహితంగా దాడిచేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో పోలీస్ అధికారులు తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఏం జరిగిందంటే..
రొయ్య శ్రీనివాస్ అనే దళిత యువకుడు నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపి విక్రయించాడని, ఆ భూమిలో ఇల్లు నిర్మించి ఉన్నదని బాధిత వ్యక్తులు జులై 6న నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసుకు సంబంధించి గతనెల 10న స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిచి నోటీసులు కూడా ఇచ్చారు. లేని భూమిని విక్రయించిన వ్యవహారంలో శ్రీనివాస్ 35శాతం కమిషన్ తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు. బాధితుడు శ్రీనివాస్ తో పాటు అతనిపై ఫిర్యాదుచేసిన బాధితుల నుంచి సమగ్రంగా అన్ని వివరాలు సేకరించి పోలీసుల తప్పు ఉన్నట్లుగా నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.

ఆ వీడియోతో సంబంధం లేదు
ఎవరో ఒక వ్యక్తిని కాళ్లు కట్టేసి కొడుతున్నట్లుగా సోషల్​మీడియాలో వైరల్​అవుతున్న వీడియో నల్లగొండ టూ టౌన్ పోలీస్​స్టేషన్ లో జరిగినది కాదని చెప్పారు. పోలీసులు రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని కొడుతున్నట్లు అసత్యప్రచారం జరుగుతోందని, ఆ వీడియో నల్లగొండ జిల్లాకు సంబంధించింది కాదని ఎస్పీ రంగనాథ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోను ప్రజలు నమ్మొద్దని ఆయన జిల్లా ప్రజలను కోరారు.