Breaking News

ధర్మయుద్ధం మొదలైంది

ధర్మయుద్ధం మొదలైంది
  • సీఎం కేసీఆర్​ గద్దె దిగడం ఖాయం
  • మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ ​చౌహాన్‌
  • ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శాపంగా 317జీవో
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో కలిసి బండి సంజయ్‌ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్‌ పోరాటస్ఫూర్తి అభినందనీయమని కొనియాడారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా జైల్లో వేస్తే ఆ జైల్లోనే పుట్టిన శ్రీకృష్ణుడు రాక్షసుడైన కంసుడిని వధించాడని ఆయన గుర్తుచేశారు. బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదన్న ఆయన కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ గుర్తుకొస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, తండ్రి సీఎం, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, ఇంకో బంధువు ఎంపీ, కూతురు ఎమ్మెల్సీ.. ఆమెను కూడా మంత్రిని చేస్తారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.

జలియన్‌ వాలాబాగ్‌’ను గుర్తుచేసింది

అంతకుముందు బండి సంజయ్‌ శంషాబాద్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి భారీ క్వానాయ్‌తో బయలుదేరివెళ్లారు. కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్న బండి సంజయ్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి జలియన్‌ వాలాబాగ్‌ ఘటనను తలపించిందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్​తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఆ ఘటనలో ఎంతో మంది నేతలు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​మాట్లాడుతూ బీజేపీ నాయకులకు కేసులు కొత్తకాదని, ధర్మయుద్ధంతోనే తాడో పేడో తేల్చుకుంటామని చెప్పారు. 317 జీవోతో రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సకలజనుల సమ్మె చేసి రాష్ట్రం సాధించి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే ఇవాళ ఆ ముఖ్యమంత్రే వాళ్ల పాలిట శాపమయ్యారని బండి మండిపడ్డారు. వరిధాన్యం కొనుగోలులో కేసీఆర్‌ ప్రజలను తప్పుదారి పట్టించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. జీవోనం.317ను తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు అంశాన్ని డైవర్ట్‌ చేస్తున్నారని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.