- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతకైనా సిద్దంగా ఉందని, సీఎం కేసిఆర్ ఆధ్వర్యంలో ఢిల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. రైతు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడానికి వెంటనే ఒక చట్టాన్ని రూపొందించాలన్నారు. నల్ల చట్టాల ఉపసంహరణ కోసం అమరులైన 700 మందికి పైగా రైతులు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చొప్పున మొత్తం 21 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు దేశంలోనే మొదట మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొనుగోలు పై స్పష్టత ఇవ్వకుండా ముడి బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పటం దేనికి సంకేతమో తెలపాలి అని విమర్శించారు.