Breaking News

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం..

బిడ్డను ప్రాణంగా పెంచుకున్నం
  • మా కూతురుకు ఏమైందో చెప్పండి
  • మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన
  • ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన
  • కలెక్టర్​, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు

సామాజికసారథి, మహబూబ్​నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్​అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. సదువు కోసం పంపిస్తే చాపలో చుట్టి పంపించారు’ అంటూ నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బోనాసి గోపాల్, సుమిత్ర కన్నీరుమున్నీరయ్యారు. వారి కూతురు మాధవి(18) మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్​కాలేజీలో నీట్​కోచింగ్​తీసుకుంటోంది. ఈనెల 1వ తేదీన కాలేజీ నుంచి హాస్టల్​కు వెళ్లిన విద్యార్థిని మాధవి రైలుపట్టాలపై తల, మొండెం, కాలు వేర్వేరుచోట్ల పడి మాంసపు ముద్దగా మారింది. వారం రోజులు గడిచినా ఇంత వరకు ఆచూకీ లభించడం లేదు. ఈ క్రమంలో గుండెల నిండా దు:ఖంతో తల్లిదండ్రులు విషాదంతో మునిగిపోయారు. గోపాల్, సుమిత్ర దంపతులు, బంధువులు, పాలెం గ్రామస్తులతో కలిసి మహబూబ్​నగర్ లోని ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యం విద్యార్థినుల భద్రతను గాలికొదిలివేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనీసం హాస్టల్​లో సీసీ కెమెరాలు కూడా లేవని, విద్యార్థులను పట్టించుకోని యాజమాన్యంపై కేసు నమోదుచేసి శిక్షించాలని కోరారు. జిల్లా కలెక్టర్​, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మృతురాలి తల్లిదండ్రుల ఆందోళనకు కేవీపీఎస్ నాయకులు మీసాల కుర్మయ్య, ఎస్ఎఫ్​ఐ, డీవైఎఫ్​ఐ నాయకులు మద్దతు తెలిపారు.