- ఏడేళ్లుగా రూ.4.25లక్షల కోట్ల అప్పు
- జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు
- బీఎస్పీ నేత డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సామాజిక సారథి, దుబ్బాక: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నియంత చేతుల్లో బందీ అయిందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఎస్పీ ఏర్పాటుచేసిన బహుజన రాజ్యాధికార ప్రతిజ్ఞసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి అమరుల త్యాగం ఫలితంగా, కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు అడ్డాకూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం అధోగతిపాలు
వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. దమ్ముంటే అన్ని ఆధిపత్య కుల పార్టీలు తమ సవాలును స్వీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో అక్షరాస్యత శాతం కేవలం 59శాతమని, జనాభాలో ప్రతి రెండో మహిళ నిరక్షరాస్యులుగా మిగలడం శోచనీయమన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూ.4.25 లక్షల కోట్ల అప్పుల పాలైయిందన్నారు. దీనివల్ల పేద ప్రజలపై మరింత పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కోట్లాది మంది ప్రజల కష్టాలు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి రావడం ఖాయమని, ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ వెళ్లేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు బీఎస్పీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.