- ‘మళ్లీ ఎమ్మెల్సీ’ హామీతోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి..
- టిక్కెట్ రాకపోవడంపై అనుచరవర్గంలో ఆందోళన
- అధిష్టానం నిర్ణయంపై వేచిచూసే ధోరణిలో కూచకుళ్ల
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పలువురి పోటీ
- ఎమ్మెల్సీ కసిరెడ్డి, సాయిచంద్‌కు ‘స్థానిక సంస్థల’ టికెట్
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్‌నేత, సిట్టింగ్ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి టీఆర్ఎస్అధిష్టానం మొండిచేయి చూపింది. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే ఆయనకు ఈసారి కచ్చితంగా అధిష్టానం టిక్కెట్ ఇస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘పక్కాగా మళ్లీ మీకే’ అనే అధిష్టానం నమ్మకమైన హామీతోనే కాంగ్రెస్‌ను వీడి ఆయన టీఆర్ఎస్లో చేరారు. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు కళాకారుడు సాయిచంద్‌కు ఎమ్మెల్సీ టికెట్ఖరారైనట్లు తెలిసింది. ఇదిలాఉండగా, రాజకీయంగా ప్రత్యర్థులుగా పోటీపడినా టీఆర్ఎస్లో చేరిన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి విజయం కోసం కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అహర్నిశలు కృషిచేసి భారీ మెజారిటీ అందించగలిగారు. నియోజకవర్గంలో 30వేల ఓటు బ్యాంకు కలిగిన ఉన్న దామోదర్ రెడ్డి లాంటి నాయకులు పార్టీకి దూరమైతే సంస్థాగతపరంగా అధికారపార్టీకి కొన్ని ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలో ఆయన అనుచరులు, అభిమానులు గులాబీ గూటి నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
‘పక్కా హామీ’తో టీఆర్ఎస్లో చేరిక
ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి టీఆర్ఎస్పార్టీ నుంచి గతంలో సిట్టింగ్ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. మరోస్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరారు. జాయిన్ చేసుకునే క్రమంలో మళ్లీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఇద్దరు హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అంతవరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వస్తుందని ఆశలు పెట్టుకున్నా అదిరాకపోవడంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో ఓట్లను బాగా మేనేజ్ చేయగలడన్న నమ్మకం అధిష్టానం దృష్టిలో ఉంది. మరోస్థానం కోసం మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, ప్రముఖ గాయకుడు సాయిచంద్పోటీపడ్డారు. వారిలో సాయిచంద్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు.
విబేధాలే కారణమా?
కూచకుళ్ల దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 50వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2020 మే నెలలో దామోదర్‌రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉన్న పెద్దముద్దునూరు సర్పంచ్, ఎంపీటీసీపై, మరో 20 మంది రైతులకు కేసులై జైలుకు వెళ్లారు. ఈ ఉదంతంలో పత్తి వ్యాపారి ఎమ్మెల్యే మర్రి అనుచరుడు. మోసానికి గురైన రైతులు, ఎంపీటీసీ, సర్పంచ్దామోదర్రెడ్డి వర్గీయులు. నాటి నుంచి ఇద్దరి మధ్య విబేధాలు రాజుకొని పోటాపోటీగా నడుస్తోంది. నియోజకవర్గంలో దామోదర్‌రెడ్డి వర్గీయులు ప్రజాప్రతినిధులుగా ఉన్న గ్రామాలపై పోలీసులు కేసులు ఎక్కువకావడంతో సాక్షాత్తూ ఎస్పీ, కలెక్టర్తీరుపై ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మీడియా వేదికగా వారితీరును ఎండగట్టారు. ఈ పంచాయితీ అప్పట్లో మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. నాటి నుంచి మొదలైన విబేధాలు సీటు రాకపోవడం వరకూ నడిచాయి. ఆయనకు సీటు రాకపోవడానికి ఇదే కారణమై కావొచ్చని నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. వారం రోజుల్లోనే నాగర్‌కర్నూల్ జిల్లాలో రాజకీయాలు మారాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం సాయిచంద్, గతంలో ప్రముఖ వాగ్గేయకారుడు, కవి, రచయిత గోరెటి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవులు రావడానికి నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించడంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
Aipaye