Breaking News

9నుంచి సమ్మె

9 నుంచి సమ్మె
  • బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
  • సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు

సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్‌ నేత కోటా శ్రీనివాస్‌ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్‌, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్‌, సీఐటీయూ లక్ష్మణ్‌రావు, బీఎంఎస్‌ వీరమనేని రవీందర్‌రావు, హెచ్‌ఎంఎస్‌ కుమార్‌, ఇఫ్టూ నేత నాసర్‌పాషా మాట్లాడారు. కొన్నివేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని సంరక్షించుకునేందుకు జెండాలు వేరైనా సింగరేణి రక్షణే ఎజెండాగా ఐక్యంగా పోరాడి కేంద్రం మెడలు వంచాలని పిలుపునిచ్చారు.

ఇవీ కార్మికుల డిమాండ్లు

ఉత్పత్తి పక్రియకు సిద్ధమైన కేకే06 అండర్‌గ్రౌండ్‌, శ్రావణపల్లి ఓసీ, జేవీఆర్‌ ఓసీ3, కోయగూడెం బ్లాకులను సింగరేణికే అప్పగించాలన్నారు. శ్రీరాంపూర్‌, మణుగూరు గనుల్లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఈపీ ఆపరేటర్‌ రకీబ్‌ డిస్మిస్‌ను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు, కారుణ్య నియామకాలలో వారసుల వయో పరిమితి 35నుంచి 40కు పెంచాలని మెడికల్‌ అన్‌ఫిట్‌ అయ్యే వారసత్వ ఉద్యోగాల కౌన్సెలింగ్‌, పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తలపెట్టిన 72 గంటల సమ్మెలో ఢిల్లీ రైతు ఉద్యమస్ఫూర్తితో ప్రతి కార్మికుడు పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, వీరభద్రయ్య, కాపా శివాజీ, కృష్ణ, సీహెచ్‌ అశోక్‌, బుర్ర వెంకటేశ్వర్లు, ఇతర పార్టీల నాయకులు నాగరాజు, నజీరుద్దీన్‌బాబా, మల్లేష్‌, రామనర్సయ్య, బాలకృష్ణ, కరీం, బోగా రాజలింగు, వై.రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శివరావు, శ్రీకాంత్‌, కుమార్‌స్వామి, నరేశ్‌, లాలయ్య, మంగీలాల్‌, ఉప్పయ్య పాల్గొన్నారు.