- నల్లగొండ టూ టౌన్ ఎస్సై, కానిస్టేబుల్ పై వేటు
- ఉత్తర్వులు జారీచేసిన డీఐజీ కమలాసన్ రెడ్డి
- దళిత యువకుడిని కొట్టిన కేసులో సమగ్ర విచారణ
- ఉన్నతాధికారులకు విచారణ అధికారి చోడగిరి నివేదిక
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి.నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్ కే నాగుల్ మీరాపై సస్పెన్షన్వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్ఐ, కానిస్టేబుల్ చితబాదిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రొయ్య శ్రీనివాస్ అనే దళిత యువకుడు నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపి విక్రయించాడని, ఆ భూమిలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నదని బాధిత వ్యక్తులు జులై 6న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసుకు సంబంధించి గతనెల 10న నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటీసులు కూడా ఇచ్చారు. లేని భూమిని విక్రయించిన వ్యవహారంలో శ్రీనివాస్ 35శాతం కమిషన్ తీసుకున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్పీ గతంలో వెల్లడించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించారు. విచారణ అధికారి బాధితుడు శ్రీనివాస్‌తో పాటు చికిత్స చేసిన డాక్టర్లు, మరికొంత మందిని విచారించిన అనంతరం ఎస్సై తప్పిదం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. విచారణ అధికారి సతీష్ చోడగిరి ఇచ్చిన నివేదికను ఎస్పీ రంగనాథ్.. డీఐజీ వీబీ కమలాసన్ రెడ్డికి పంపించారు. అనంతరం వారిద్దరినీ డీఐజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్తెలిపారు.