సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని టీఆర్ఎస్ నేతలు భూబకాసురులుగా మారారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నరు. ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అరాచక పాలనకు ప్రతిఒక్కరూ సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ధనార్జన్ రెడ్డిగా మర్రి పేదప్రజల ఉసురు తీస్తున్నరని విమర్శించారు. మార్కెట్ యార్డ్, మెడికల్ కాలేజీ పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ కోసం పేద ప్రజల పొలాలు లాక్కొని వారి పొట్టను కొట్టారని ఆమె ఆరోపించారు. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు ఇచ్చి పేదల కన్నీరు తుడిచిన మహనీయుడు వైఎస్సార్ అని, వైఎస్సార్ పుణ్యానే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటితో ఈ ప్రాంతం అంత ఆకుపచ్చగా మారిందని ఆమె కొనియాడారు. నాయకుడేవారైనా పేదల కన్నీరు తుడవాలి కానీ వారి బతుకుల్లో చిచ్చుపెట్టొద్దని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం కోరే తమను ఆదరించాలని కోరారు. అంతకుముందు దారి పొడవునా ప్రజలను కలుస్తూ ఆప్యాయంగా పలకరించరు. వైఎస్సార్ రాజన్న కూతురువా నీవు అంటూ పలకరిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
.. షర్మిల వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలియజేయండి