– నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మాయాజాలం
– ఎంప్యానల్ లో లేకుండానే చక్రం తిప్పుతున్న సాయి సెక్యూరిటీ సర్వీసెస్
– ఇదివరకే 30 ఉద్యోగాల భర్తీ..మరో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్
– స్థానికంగా ఉన్నట్లు ఫేక్ అడ్రస్ లతో పత్రికల్లో ప్రకటనలు
– ఫేక్ ఏజెన్సీ కి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై అనుమానాలు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వడ్డించేవాడు మనోడు అయితే కడబంతిలో కూర్చున్న నో ప్రాబ్లం అన్నట్లు గా అనుమతులు ఇచ్చే అధికారులు మనోళ్లు అయితే ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చన్నట్లుగా ఉంది ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మాయాజాలం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో అవినీతి అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో అడ్డగోలుగా దోచుకోవచ్చన్న విషయం తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో అవినీతి లీలలు వెలుగులోకి వస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ లో ఓ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చేస్తున్న ఉద్యోగాల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దల సహకారం, ప్రజాప్రతినిధుల అండ, స్థానిక జిల్లా అధికారుల అండదండలు ఉండడంతో రూల్స్ తో పనిలేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకోవడం సంచలనంగా మారింది. స్థానికంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఎక్కడో హైద్రాబాద్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కి నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజీ ఉద్యోగాలను భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు అనుమతులు ఇవ్వడం విశేషం.సదరు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇదివరకే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయగా ప్రస్తుతం మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం కొసమెరుపు.
రూల్స్ గీల్స్ జాన్తానై…
ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కావాల్సిన ఉద్యోగులను సమకూర్చేందుకు ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు భర్తీ చేయాల్సీన ఉద్యోగాల వివరాలను ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. జిల్లా కలెక్టర్లు వారికున్న అధికారాల మేరకు ఆ ఉద్యోగాలను రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమించాల్సీ ఉంటుందో నిర్ణయం తీసుకుంటారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం కొన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి కొటేషన్లు తీసుకొని వారిలో బెస్ట్ ఏజెన్సీని ఎంపిక చేయాల్సీ ఉంటుంది. కాని నాగర్ కర్నూల్ జిల్లాలో ఇలాంటి రూల్స్ కు జిల్లా స్థాయి అధికారులే మంగళం పాడి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి లేదా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు తలొగ్గి కనీసం ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ ఎంప్యానల్ జాబీతాలో లేని సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ని మెడికల్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేయడం విశేషం.
ఫేక్ అడ్రస్ లతో బురిడి
సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ హైద్రాబాద్ కు చెందింది కావడంతో స్థానికంగా ఉన్నట్లు ఫేక్ అడ్రస్ లతో ఇటీవల ఉద్యోగాల భర్తీ కి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏజెన్సీ ఇది వరకే మెడికల్ కాలేజీ లో 30 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయగా తాజాగా మరో 70 ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇచ్చి రంగం సిద్దం చేసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో ఓ రోజు బిజినపల్లి మండలం పాలెం గ్రామం అడ్రస్ తో, మరో రోజు హౌజింగ్ బోర్డు బస్ స్టాప్, నాగర్ కర్నూల్ అడ్రస్ తో పొంతన లేని అడ్రస్ లతో ప్రకటనలు ఇవ్వడంతో అసలు విషయం బయటికి పొక్కింది.
భారీగా వసూళ్లు…
ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యలతో అనేక మంది నిరుద్యోగులు ఏ చిన్న ఉద్యోగమైనా చేసేందుకు సిద్దంగా ఉండడంతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కలిసోచ్చింది. మెడికల్ కాలేజీ లో ఏఏ క్యాడర్ లో ఎన్ని ఉద్యోగాలు కావాలో అటు అధికారులకు ఇటు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లకు మాత్రమే తెలుస్తుండడంతో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నామమాత్రంగా ఒకటి లేదా రెండు దినపత్రికలకు ప్రకటనలు ఇవ్వడం ఎన్ని దరఖాస్తులు వచ్చినా తమకు డబ్బులు ఇచ్చిన వారినే ఎంపిక చేసి అడ్డదారిలో వసూళ్లకు పాల్పడుతున్నా భయటికి పొక్కడం లేదు. డబ్బులిచ్చి ఉద్యోగం కొన్న వారు తమకు ఉద్యోగం వస్తే చాలన్నట్లుగా విషయాన్ని దాచి పెడుతుండడంతో అసలైన నిరుద్యోగులు మాత్రం నష్టపోతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో, అధికారుల అండతో రెచ్చిపోతున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కేవలం తమకు డబ్బులు ఇచ్చిన వారికి పైరవీలు చేసిన వారికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి నిజాయితీ, నిరుపేద నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నారు. దీంతో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి గతంలో సాయి సెక్యూరిటీ సర్వీసెస్ కి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి స్థానిక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలతో నిభందనల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
అంతా జిల్లా కలెక్టర్ పరిధిలోనే ఉంటుంది: డాక్టర్ రమాదేవి, డీన్, మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూల్–
నాగర్ జిల్లాలో మడికల్ కాలేజీ 2022 లో ప్రారంభమైంది. ఈ కాలేజీ కావాల్సీన ఉద్యోగుల వివరాలను జిల్లా కలెక్టర్ కు అందజేశాం. కలెక్టర్ అనుమతితోనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు మాకు సిబ్బందిని కెటాయిస్తాయి. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. సాయి సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ ద్వారా ఇప్పటికే 30 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. మరో 70 మంది ని భర్తీ చేసేందుకు ఇటీవల పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు.