- తప్ప తాగి జనంపైకి కారు
- కేసు పెట్టినా పలుకుబడితో రాజీ
- ఆర్జేడీ, కమిషనర్ దృష్టికి ఫిర్యాదు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాకేంద్రంలో ఓ అధ్యాపకుడు సంఘం పేరుతో రాజకీయంగా చక్రం తిప్పుతూ 19ఏళ్లు ఒకేచోట పనిచేయడంపై ‘కదలడు.. వదలడు’ అనే శీర్షిక ‘సామాజికసారథి’లో శుక్రవారం వెలువడిన కథనానికి పలువురు స్పందించారు. విగ్రహావిష్కరణ పేరుతో చందాలు వసూలు చేస్తూ హల్చల్చేసేవాడని చెబుతున్నారు. వసూలు చేసిన పైసల లెక్క చెప్పాలని అదే సంఘానికి చెందిన ఓ దివ్యాంగుడైన ఉద్యోగి ప్రశ్నించడంతో గొంతుపిసికి చంపుతానని బెదిరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పోలీసులకు ఫిర్యాదుచేసినా కొందరు రాజకీయ నాయకులు రాజీచేశారు. తప్పతాగి తన వాహనాన్ని జిల్లా కేంద్రం బస్టాండ్ ప్రాంతంలో ప్రజలపైకి దూసుకెళ్లడంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం సంచలనంగా మారింది. తన రాజకీయ పరపతితో కేసు లేకుండా చేసుకున్నాడు. ఆ సంఘటన మరచిన కొద్దికాలంలోనే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఫోన్లో దుర్భాషలాడటంతో సదరు అధ్యాపకుడిపై కాంచన బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో తన పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ కేసు రాజీ చేయించుకున్నాడు. జిల్లా కేంద్రంలోని తన రాజకీయ ఉనికిని కాపాడేందుకు కుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని లక్షల చందాలు వసూలు చేసి ముఖం చాటేసిన సదరు అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ, కమిషనర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పలువురు తెలిపారు.