- పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- అలసత్వం వహించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి
- అధికారులతో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమీక్ష
సారథి, ఎల్బీనగర్(హైదరాబాద్): నియోజకవర్గ పరిధిలోని నాలాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.113 కోట్లు మంజూరు చేసిందని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జోనల్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలోని నాలాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న కాప్రాయిచెరువు నాలా పనులు, బైరామల్‌గూడ చెరువు అభివృద్ధి పనుల్లో అలసత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని, ఇప్పుడిప్పుడే కార్మికులు వస్తున్నారని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్ఎన్‌డీపీ చీఫ్ ఇంజినీర్ వసంత, జోనల్ కమిషన్ ఉపేందర్‌రెడ్డి, సుభాని, ఇరిగేషన్ శాఖ, ప్రాజెక్టు అధికారులు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.