- ఆధ్యాత్మిక భావం వదిలి ఆదాయమార్గం వైపు మొగ్గు.
- పనిచేయని స్థానిక ఆలయ కమిటీ మంత్రము.
- ఈవో మార్పు దేనికి సంకేతం?
సామాజిక సారథి, ఐనవోలు: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శివ క్షేత్రాల్లో హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం చాలా ప్రసిద్ధ చెందినది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, గొల్ల కురుమల కొలిచే స్వామి మల్లికార్జున స్వామి. సంక్రాంతి నుండి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు జాతర చాలా వైభవంగా జరుగుతాయి. జాతర చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కనుకనే స్వామి వారి బ్రహ్మోత్సవాలు జాతర నిర్వహించడం ఇక్కడి అధికారులకు ప్రతీ ఏటా కత్తి మీద సామే. అందుకే పండుగ నెల రోజుల ముందుగానే జిల్లా ఇంచార్జ్ మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు అధికారులను హెచ్చరించారు. అందుకు గానూ జాతర కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మంత్రులు సమీక్ష జరిపి ఇన్ని రోజులు గడుస్తున్నా ,జాతరలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. జాతర ఏర్పాట్లపై ఆలయ పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పేరిట గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరీ చేసింది. నిధులు మంజూరు అయ్యి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆలయ తోరణం ఇంకా నిర్మాణ పనుల్లోనే ఉంది. ఐనవోలు ఇప్పుడు మండలం ఏర్పాటుతో ధరలు ఆకాశాన్ని తాకి చుట్టుపక్కల భూములు లేకుండా పోయాయి. ఇకపోతే కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఆలయ ప్రహారిగోడ వల్ల జాతరకు సహజత్వం కోల్పోయిందనే చెప్పాలి. ప్రహారి గోడ నిర్మించటంతో భక్తులను కోళ్లు కమ్మినట్లుగా వుండి జాతర కళ తప్పింది. జాతర అంటే వినోదాలు సరదాలు శివసత్తుల నాట్యాలతో జనం రద్దీతో ఉంటేనే చూడటానికి వచ్చిన భక్తులకు కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు భక్తితో,పాటు వినోదంకోసం వచ్చే భక్తులను రెండుగా విభజించినట్లు అయ్యింది.
పనిచేయని స్థానిక మంత్రం.
జాతరను కన్నుల పండుగగా జరిపే క్రమంలో ఆలయ అధికారులు పాలకవర్గంది అత్యంత కీలకమైన పాత్ర. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి భాద్యత ఆలయ పాలకవర్గానిదే. అత్యంత కీలకమైన స్థానాల్లో ఈసారి స్థానికులే ఉండటంతో జాతర పై వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో దేవాలయం శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని అంతా భావించారు. భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పించే విషయంలో అధికారులు ప్రతీ సారీ విఫలం అవుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా కోట్ల రూపాయలు వెచ్చించి జాతర ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం ఈసారైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుని భక్తుల అభిమానాన్ని చూరగొంటారా వేచి చూడాల్సిందే.