Breaking News

ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి


సారథి, సిద్దిపేట ప్రతినిధి: అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఇసుకను తీసుకెళ్తున్నామని అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రేణుకా ఎల్లమ్మ వాగు, మోయతుమ్మెదవాగు, పిల్లివాగు పందిల్ల, పొట్లపల్లి, కప్పగుట్ట, తొటపల్లి, నార్లపూర్, బస్వాపూర్, వింజపల్లి, కూరెళ్ల, తంగళ్లపల్లి, వరుకోలు, రామంచ, కొండాపూర్ గ్రామాల నుంచి అక్రమార్కులు అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు నిమ్మకునిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పేదోడి ఇండ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు దొరకని ఇసుక హైదరాబాద్ మహానగరానికి ఎలా రవాణా అవుతుందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అధికార పార్టీ నాయకులు ఇసుక దందాలు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ రవాణా అడ్డుకోవాలని, లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం హుస్నాబాద్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి రాజ్ కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇన్ చార్జ్​రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు రాజు, శ్రీనివాస్, టీడీపీ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.