Breaking News

పేదల విద్యా‘సౌభాగ్యం’

పేదల విద్యా‘సౌభాగ్యం’

  • ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఔదార్యం
  • తాడూరు ప్రభుత్వ జూనియర్​ కాలేజీకి రెండెకరాల భూదానం
  • తన సతీమణి స్మారకార్థం విద్యాభివృద్ధికి శ్రీకారం
  • సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్: పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా చాలా పేదపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోడంతో ఎంతోమంది ఆడబిడ్డలు చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువులకు పేదరికం అడ్డకాకూడదని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి గొప్పగా రాణించాలని సంకల్పించారు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి. అందులో భాగంగానే తన సతీమణి స్వర్గీయ కూచకుళ్ల సౌభాగ్య స్మారకార్థం నాగర్​కర్నూల్ ​జిల్లా తాడూరు ప్రభుత్వ జూనియర్​ కాలేజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ సుమారు 260 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఆర్ట్స్, ఒకేషనల్​ గ్రూపులు ఉన్నాయి. 18 గ్రామాల విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. అయితే 2008లో నాగం జనార్ధన్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాడూరుకు కాలేజీ మంజూరైంది. స్థలం లేకపోవడంతో నిర్మించలేకపోయారు. అదే సమయంలో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా జెడ్పీ చైర్మన్​గా ఉన్న కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఈ విషయాన్ని 2009లో నాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్​ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో దామోదర్​రెడ్డి స్వయంగా మూడెకరాల స్థలం కొని రెండెకరాలను రాసివ్వడంతో కాలేజీ మంజూరైంది. అయితే జిల్లా కేంద్రమైనా నాగర్​కర్నూల్ ​సమీపంలోనే ఉన్నా అక్కడికి వెళ్లలేనివారు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చేరుతున్నారు. ఈ కాలేజీలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉండటంతో విద్యార్థులు ఏటా 90శాతం పైగానే ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

రూ.16లక్షలతో అభివృద్ధి
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి కాలేజీ నిర్మాణం కోసం ఆయన సతీమణి సౌభాగ్య పేరు మీద రెండెకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొని కాలేజీకి దానం చేశారు. మరో ఎకరా స్థలాన్ని విద్యుత్ ​సబ్​స్టేషన్​కు రాసిచ్చారు. కళాశాల అభివృద్ధికి రెండేళ్లలో తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.16లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిధులతో కాలేజీలో కరెంట్ ​వైరింగ్, క్లాస్​రూమ్​ల ఫ్లోరింగ్, కళాశాల ఆవరణలో మట్టితో చదును చేయడం, స్టేజీ నిర్మాణం, ఫర్నిచర్ కొనుగోలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పూర్తిచేశారు. ఇటీవల ఆయన కాలేజీని సందర్శించి విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సిబ్బంది పనితీరును చూసి శభాష్! అని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో తాడూరు ప్రభుత్వ జూనియర్​ కాలేజీ పేరును కూచకుళ్ల సౌభాగ్య ప్రభుత్వ జూనియర్​కాలేజీగా పేరు మార్చుతూ ప్రభుత్వం ఈనెల 3న ఉత్తర్వులు జారీచేసింది. విద్యాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి

విద్యార్థులు చదువులకు దూరం కావొద్దనే..
పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావొద్దనే తాడూరులో ప్రభుత్వ జూనియర్​కాలేజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. మొదటి నుంచీ విద్యాభివృద్ధి ద్వారానే పేదరికం పోతుందని భావించే కుటుంబం మాది. మా స్వగ్రామం తూడుకుర్తిలో స్కూళ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా జడ్పీచైర్మన్​గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖర్​రెడ్డి వద్దకు వెళ్లి కళాశాలను సాంక్షన్​చేయించాను. నా సతీమణి స్వర్గీయ సౌభాగ్య పేరు మీద రెండెకరాల పొలం కాలేజీకి కొనిచ్చాను. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.16లక్షలు మంజూరుచేశారు. పేదింటి బిడ్డలు గొప్పగా ఎదగాలన్నదే నా ఆశయం.
:: కూచకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్సీ