Breaking News

రైతులపై రాజకీయమా..?

రైతులపై రాజకీయమా..?
  • బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపై ఆరెస్పీ ఆగ్రహం
  • నార్కట్ పల్లిలో ఐకేపీ కేంద్రం పరిశీలన

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ కో ఆర్డినేటర్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ధాన్యంకొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో దేశానికి అన్న పెట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో రైతులు వడ్లు వేస్తే ఉరేనన్న గతి తీసుకువచ్చేలా కేసీఆర్ సర్కార్, కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనబోమని ప్రభుత్వం చెబుతోందని, వరికి ప్రత్యామ్నాయంగా ఏ రకమైన పంటలు సాగుచేయాలో సూచించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ పంటలు, మద్దతు ధరలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశాడు. కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ వర్గ ఇన్ చార్జి ప్రియదర్శిని మేడి, తదితర నాయకులు పాల్గొన్నారు.

హమాలీగా మారి.. ధాన్యం బస్తామోసి..

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆరెస్పీ పరిశీలించిన అనంతరం పక్కనే ఉన్న హమాలీలతో మాట్లాడారు. అనంతరమే ఆయనే హమాలీగా మారాడు. ధాన్యం బస్తాను ఎత్తుకుని మోశాడు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే శ్రమజీవులకు విముక్తి లభిస్తుందని, రాజ్యాధికారం దిశగా బహుజనులు తరలిరావాలని అన్నారు.