Breaking News

శిల్పాచౌదరిని విచారించిన పోలీసులు

శిల్పాచౌదరిని విచారించిన పోలీసులు
  • ఆధారాల సేకరణకు యత్నాలు

సామాజిక సారథి, హైదరాబాద్‌: పలువురిని మోసం చేసిన కేసులో శిల్పాచౌదరిని రెండో రోజు నార్సింగి పోలీసులు విచారించారు. గండిపేటలోని శిల్పా నివాసం సిగ్నేచర్‌ విల్లాకు ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. ఆధారాల సేకరణకు శిల్పాచౌదరి ఇంట్లో పోలీసుల తనిఖీలు చేశారు. మీడియా కంటపడకుండా రహస్యంగా పోలీసుల విచారణ చేశారు. సాయంత్రానికి శిల్పాచౌదరి పోలీస్‌ కస్టడీ ముగిసింది. మరో రెండు కేసులకు సంబంధించి శిల్పాను తిరిగి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కీలకమైన ఆధారాలను నార్సింగి పోలీసులు సేకరించారు. కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి.. పోలీసు విచారణలో తన డాబూ.. దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్భాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్‌లోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారులు నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు.