Breaking News

పైసలిస్తే తారుమారు..!

పైసలిస్తే తారుమారు
  • యాక్సిడెంట్ కు కారణమైన ట్రాక్టర్ ఎక్కడ..?
  • చావుకు కారణమైన వెహికిల్​ స్థానంలో మరొకటి
  • నిందితులను కాపాడేందుకు పోలీసుల బేరసారాలు
  • నాగర్ కర్నూల్ పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పైసలిస్తే అక్కడ నిజాన్ని అబద్ధం చేయగలరు. లేనిది ఉన్నట్లు నమ్మించగలరు.. నాగర్​ కర్నూల్​ లో అచ్చంగా ఇదే జరిగింది. ప్రమాదానికి కారణమైన వెహికిల్​ స్థానంలో మరో వాహనాన్ని చూపించారు. ఆ వివరాలేమిటో చూద్దాం. నాగర్ కర్నూల్ పట్టణ ప్రాంతంలోని దేశిటిక్యాల చౌరస్తాలో గతనెల 3న వేరుశనగ పొట్టు లోడ్ తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆకాష్(19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకటస్వామి తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదంపై మృతుడి తల్లి సుజాత ఫిబ్రవరి 4న నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ట్రాక్టర్ ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రైం నం.66/2023 లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ వైపు కొడుకు మృతదేహం.. మరోవైపు భర్త తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలు కావడంతో బాధితుల ఫిర్యాదులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్(టీఎస్ 31టీ3491)ను నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్ది రోజుల పాటు అక్కడే ఉన్నది.

రిపోర్టులో మారిన ట్రాక్టర్​

నిందితులను కాపాడేయత్నం
రోడ్డు ప్రమాదంలో వేరుశనగ లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ (టీఎస్ 31టీ3491) ఢీకొట్టినట్లు స్థానికులు, బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు ఎఫ్ఐఆర్ లో నమోదుచేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను సుమారు 15 రోజులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచినా ఆ తర్వాత మార్చివేశారు. ట్రాక్టర్ కు ముఖ్యంగా ధ్రువీకరణపత్రాలు లేకపోవడం, ఇన్సురెన్స్​ లేకపోవడం గుర్తించిన పోలీసులు ట్రాక్టర్ యజమానితో బేరసారాలకు దిగారు. ఈ కేసులో ఇదే ట్రాక్టర్ ను చూయిస్తే జైలుశిక్ష తప్పదని యజమానికి చెప్పడంతో ఎలాగైనా తనను కాపాడాలని పోలీసులను యజమాని వేడుకున్నాడు. దీనికోసం తాము చెప్పిన సెటిల్ మెంట్ కు అంగీకరించాలని పోలీసులు యజమానికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితులను కాపాడేందుకు పోలీసులు భారీ స్కెచ్ వేసి విజయవంతంగా అమలు చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ స్థానంలో దర్జాగా కొత్త ట్రాక్టర్(టీఎస్ 31ఎఫ్ టీ ఆర్ 1904)ను చేర్చి నాగర్ కర్నూల్ జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి(ఆర్టీఏ) చేత వెరిఫికేషన్ చేయించి కోర్టుకు సబ్మిట్ చేశారు. నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్ జిల్లా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐ లాంటి ఉన్నతాధికారులు అందరూ అక్కడే ఉంటున్నా దర్జాగా ఈ పోలీస్ అధికారి ట్రాక్టర్ ను మార్చివేసి చట్టాన్ని ఉల్లఘించారన్న ఆరోపణలు బాధితుల నుంచి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ స్థానంలో మరొక ట్రాక్టర్ ను పెట్టి కోర్టుకు పంపించేందుకు పూర్తి ఆధారాలు సృష్టించారు. ఈ విషయంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పలువురు పోలీసుల సెటిల్​ మెంట్​ ను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.