Breaking News

ఏపీలో పంచాయతీ పోరు షురూ

ఏపీలో పంచాయతీ పోరు షురూ

అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్​లో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్​ ఖరారైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్​ను విడుదల చేసింది. గతంలో చేసిన ప్రకటనను రీ షెడ్యూల్ ​చేసింది. గత షెడ్యూల్ ​ప్రకారం ఫిబ్రవరి 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. తాజాగా మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్​నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి జనవరి 29 నుంచి, రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 2 నుంచి మూడోవ దశకు 6వ తేదీ నుంచి, నాలుగవ దశ ఎన్నికలకు 10వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎలక్షన్​ కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ తెలిపారు. అదేరోజున సాయంత్రం 4 గంటల తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా 659 మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. మొదటి దశ 173 మండలాల్లో, రెండవ దశ 169, మూడవ దశ 171, నాలుగవ దశలో 146 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు.
తొలి దశ షెడ్యూల్
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 31న నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా కేటాయించారు. ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన అనంతరం 2న అభ్యంతరాల పరిశీలన, 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం, 4న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.
రెండవ దశ షెడ్యూల్
పంచాయతీ ఎన్నికల్లో ఫిబ్రవరి 2 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 4న నామినేషన్ల దాఖలుకు తుది గడువు విధించారు. 5న నామినేషన్ల పరిశీలన, 6న అభ్యంతరాల పరిశీలన, 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం, 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. ఫిబ్రవరి 13న పోలింగ్.. అనంతరం ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
మూడవ దశ షెడ్యూల్​
పంచాయతీ ఎన్నికల్లో మూడవ దశ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 6 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 8న నామినేషన్లు వేసేందుకు తుది గడువు, 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన అనంతరం 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 12న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. 17న పోలింగ్ అనంతరం సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు.
నాలుగవ దశ షెడ్యూల్
పంచాయతీ ఎన్నికల్లో చివరి ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 12న నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంటుంది. 13న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. 15న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుంది. 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. 21న సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అనంతరం ఓట్లను లెక్కిస్తారు.