Breaking News

లక్షకుపైగా కేసులు

లక్షకుపైగా కేసులు
  • దేశంలో విస్తరిస్తున్న కరోనా
  • ఒమిక్రాన్‌ కేసులు 3,071

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతానికి పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు 3,071గా ఉన్నాయి. అందులో 1,203 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్‌ విస్తరించిందని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 876 మంది దీని బారినపడ్డారు. ఢిల్లీలో కేసుల సంఖ్య 513కు చేరింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే 40వేల కేసులు నమోదయ్యాయి. ముంబైలో 20,971, పశ్చిమబెంగాల్‌లో 18వేలు, ఢిల్లీలో 17వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. మిజోరంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి చేరింది.