- బిడ్డను నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య
- మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్‌లో ఘటన
సామాజిక సారథి, మిడ్జిల్: ఆ తల్లికి ఏ ఆపద వచ్చిందో తెలియదు కానీ తాను లేని ఈ లోకంలో తన కూతురును కూడా ఉండొద్దని భావించినట్టుంది. 9నెలల కుమార్తెను నడుముకు కట్టుకొని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9నెలల కూతురు ఉంది. కుటుంబకలహాల నేపథ్యంలో సరిత మనస్తాపానికి గురై చిన్నారితో కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా మిస్సింగ్కేసుగా నమోదుచేశారు. ఈ క్రమంలో గురువారం గ్రామ శివారులోని నీటికుంటలో తల్లి, కుమార్తె మృతదేహాలను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని సరిత తన నడుముకు కట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను బయటకుతీసి పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జయప్రసాద్ తెలిపారు. కాగా, కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేకే సరిత బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.