Breaking News

ఒమిక్రాన్​ కేసుల్లేవ్​

ఒమిక్రాన్ కేసుల్లేవ్
  • వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం ముందంజ
  • గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో పారిశుద్ధ్యం మెరుగు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడి

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్‌ రాగా.. అందరికీ ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చిందని, వాక్సినేషన్‌పై ప్రజలకు మరింత అవగాహన పెంచేలా మీడియా వార్తాకథనాలు పెంచాలని సూచించారు. మొదటి డోస్‌ 97శాతం, రెండో డోస్‌ 53 శాతంగా నమోదైందన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించాలని కోరారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో అధునాతన సీటీస్కాన్‌, నియోనాటల్‌ స్కిల్‌ ల్యాబ్‌ను మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో పారిశుద్ధ్య చర్యలను పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నట్లు హెచ్చరించారు. నిలోఫర్‌లో కార్డియాలజీ లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపారని, దీనిపై ఒక కమిటీ వేసి, వారంలో నివేదిక ఇవ్వాలని చెప్పామన్నారు. డీపీహెచ్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ మంగళవారం ములుగు, సిరిసిల్ల వెళ్తున్నారని, వారిచ్చే నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు చేపడుతామని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యారోగ్య రంగంలో దేశంలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుతున్నదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పురస్కారాలే స్పష్టం చేస్తున్నాయని మంత్రి అన్నారు.

అందరికీ ‘ఆయుష్మాన్‌ భారత్‌’ చికిత్స
ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1,698 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో ఉన్నామని, కేంద్రం మూడు అంశాల్లో అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు రెండు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తామని, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారికి కూడా ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స చేయాలని నీలోఫర్‌ డాక్టర్లకు సూచించినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి కొందరు సిఫారసుపై వస్తున్నారన్నారు. వారందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్స అందించాలని చెప్పానన్నారు. నీలోఫర్‌లోని ఎనిమిది హెచ్‌ఓడీల వారీగా సమీక్షించామని, కావాల్సిన పరికరాలను సమకూర్చాలని టీఎస్‌ఎస్‌ఎంఐడీసీ ఎండీని ఆదేశించామన్నారు. ఆస్పత్రికి ఏటా ఆరోగ్యశ్రీ కింద రూ.10 కోట్లు వస్తున్నాయన్నారు. వీటిని హాస్పిటల్‌ అభివృద్ధికి వినియోగించేలా సూపరింటెండెంట్‌ ఆదేశాలిచ్చామని తెలిపారు. గతంలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కుటుంబానికి రూ.రెండు లక్షలు ఉంటే సీఎం కేసీఆర్‌ రూ.ఐదులక్షలకు పెంచారన్నారు. ఆ అవకాశాన్ని ఉపయోగించాలని సూచించారు. ప్రతినెలా రివ్యూ చేయాలని డీఎంఈకు సూచించామని, ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు సైతం ఓపీలో కూర్చోవాలని ఆదేశాలిచ్చినట్లు వివరించారు.