- బాధితులు అవస్థలు పడుతున్నారు
- డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిక
జెనీవా: ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానమ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు, ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ, పురుషులు మూడునెలల పాటు గర్భనిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చని హెచ్చరించారు. అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్‌మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15–18 ఏళ్ల వయస్సు వారికి ‘కోవాక్సిన్’ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కొవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడొద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో 30వేల మందిలో దాదాపు 10–20 శాతం మందికి మాత్రమే సమస్యలు వచ్చాయని, చాలా వరకు తేలికపాటివి, ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయని తెలిపింది. డాక్టర్సలహా మేరకే మందులు వాడాలని కూడా పేర్కొన్నది. అలాగే వ్యాక్సిన్ తర్వాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి ఇది సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.