Breaking News

కళాశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను

కళాశాల భూమిపై కబ్జా కొరుల కన్ను

సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కొమురయ్యకు నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని వినతి పత్రం అందించారు. వివేకానంద ప్రభుత్వ సహాయక జూనియర్ కళాశాలకు 1964లో మున్సిపల్ స్థలాన్ని ఓ మహానుభావుడు గిఫ్ట్ గా కేటాయించారని, ఈ స్థలంలోని 1000 గజాల్లో ఓ కంపెనీకి చెందిన పెట్రోల్ బంకును నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వారు మున్సిపాలిటీకి సుమారు రూ.12 లక్షల పన్ను బకాయి ఉన్నా బంకు నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారని, అవినీతికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సముద్రాల పరమేశ్వర్, ప్రభుత్వ లేక్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ పెరుమాండ్ల లక్ష్మణ్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల, సీపీఎం కాశీబుగ్గ ఏరియా కార్యదర్శి ఎం.డి బషీర్, రామన్న పేట ఏరియా కార్యదర్శి సింగారపు బాబు, బీజేపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూచన క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.