- మాల్స్, షాపుల్లో వ్యాక్సిన వేసుకోనివారికి నో ఎంట్రీ
గౌహతి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ రాలేదు అనుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒకేరోజు ఏడు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 9కి చేరింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి ఒమిక్రాన్ సోకినట్లు తేలడంతో వెంటనే స్పందించింది. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు జారీచేసింది. శనివారం రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరగడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు, జనం గుమిగూడే చోట జాగ్రత్తలు పాటించాలని కోరింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతించవద్దని, ఒకవేళ అనుమతిస్తే నిర్వాహకులకు రూ.25వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.