Breaking News

హక్కుల కోసం కలసి పోరాడాలి

హక్కుల కోసం కలసి పోరాడాలి
  • బీజేపీ ప్రభుత్వం హక్కులను కాలరాస్తోంది
  • పార్టీని వీడితే కేసులను తిరగతోడుతోంది
  • సమాఖ్య వ్యవస్థ కోసం ఉమ్మడి కార్యాచరణ
  • సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

సామాజికసారథి, హైదరాబాద్‌: హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పోరాటం చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. యూపీలో బీజేపీకి మంత్రి మౌర్య రాజీనామా చేసినందుకు ఆరేళ్ల క్రితం కేసును తిరగదోడి వేధిస్తున్నారని అన్నారు. వేధింపులను అరికట్టేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలని కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హక్కుల కోసం కలసి పోరాడుదామని సీఎం కేసీఆర్‌ను కేరళ సీఎం పినరయి విజయన్‌ కోరారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వెల్లడించారు. ప్రజాస్వామ్యన్ని ఖూనీచేసి రాజ్యాంగ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు భారీగా పెరిగాయి కానీ.. గిట్టుబాటు ధరలు పెరగలేదన్నారు. ధరలను అదుపులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని తెలిపారు. కార్మిక కోడ్‌, ధరల పెరుగుదల, ప్రభుత్వ సెక్టార్ల అమ్మకంపై ఫిబ్రవరిలో సీపీఎం పెద్దఎత్తున ఉద్యమాలు చేయనుందని ఆయన పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థ కోసం ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ మెతకవైఖరి
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలుచేస్తోందని, తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ మెతకవైఖరి అవలంభిస్తోందని, ఇటీవల బీజేపీ ఓడిపోవాలని సీఎం కేసీఆర్‌ స్టేట్‌ మెంట్‌ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్‌ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్‌ మెంట్‌ ఎక్కడా లేదని పేర్కొన్నారు. లీకులు ఇచ్చి చెప్పేది నమ్మలేమని, లీకులు ఇచ్చి బీజేపీనీ దారిలోకి తెచ్చుకుంటున్నారా..? లేక జనం అభిప్రాయం తెలుసుకోవాలని లీకులు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. స్పష్టమైన విధానం ఉండాలని, టీఆర్‌ఎస్‌ పాలన అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ దొర వైఖరి కొనసాగిస్తున్నారని, పోరాటం కాదు.. బతిమిలాడితేనే చేస్తామనే వైఖరిలో టీఆర్‌ఎస్‌ ఉందన్నారు. ఇది మంచిది కాదని తమ్మినేని హితవు పలికారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఇదే జరిగిందని అన్నారు.