Breaking News

శ్మశానాల్లో శవాల గుట్టలు

శ్మశానాల్లో శవాల గుట్టలు

  • కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులు
  • వారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్‌, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను అధిగమించిన మహమ్మారి ఇప్పుడు మృత్యుపంజా విసురుతోంది. ఒకవైపు కరోనా పేషెంట్లతో అంబులెన్సులు హాస్పిటళ్ల ముందు లైన్​ కడుతున్నాయి. మరోవైపు శ్మశానవాటికల ముందు శవాల లైన్‌లు దర్శనమిస్తున్నాయి. కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, వారణాసి, లక్నోతో పాటు మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్, జార్ఖండ్‌లో రాంచీ, ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, గుజరాత్, ఢిల్లీలోనూ హృదయవిదారక దృశ్యాలు తాండవిస్తున్నాయి.

అంత్యక్రియలకు 5గంటలు
ఉత్తరప్రదేశ్‌లో శ్మశానవాటికల ముందు శవాలతో బంధువులు బారులుదీరుతున్నారు. వరుసగా శవాలను క్యూలో పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. వారణాసిలోని హరిశ్చంద్రఘాట్‌లో శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఐదు గంటలు లైన్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని రవీంద్రగిరి అన్నారు. లక్నోలో నిరంతరం మండుతున్న కాట్నాల వీడియోలు వైరల్ కావడంతో శ్మశానవాటిక చుట్టూ ఇనుపరేకులను ఏర్పాటుచేశారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో శ్మశానవాటికలకు స్థలం లేక ఇబ్బంది ఎదురవుతోంది నాలుగు రోజుల్లోనే 200 శవాలకు అంతిమక్రియలు నిర్వహించామని, ఈ స్థాయిలో శవాలను గతంలో తామెన్నడూ చూడలేదని భద్‌బదాలోని విశ్రమ్ ఘాట్‌ అధికారి మమతేశ్ శర్మ పేర్కొన్నారు. ఇంకా భారీగా వస్తున్న శవాల కోసం పక్కనే ఉన్న రెండు ఎకరాలను అంత్యక్రియలకు అనువుగా మార్చుకుంటున్నామని వివరించారు.

నాలుగు రెట్లు పెరిగిన రద్దీ
ఢిల్లీలోని శ్మశానాలు జనవరి, ఫిబ్రవరితో పోల్చితే ఇప్పుడు నాలుగు రెట్లు అధికంగా శవాలు వస్తు్న్నాయి. మూడు రోజుల్లోనే 90శాతానికి మించి శవాలు వస్తున్నాయని లోధి శ్మశానవాటిక పండిట్ తెలిపారు. ఢిల్లీలోని అతిపెద్ద శ్మశానం నిగమ్‌బోధ్ ఘాట్‌ లోనూ అంకంతకూ మృతదేహాలు బారులు తీరుతున్నాయి. త్వరలో కలప, సిబ్బందిని పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జయప్రకాశ్ వెల్లడించారు.

అస్థికలతో లాకర్లు ఫుల్లు
సాధారణంగా హిందు సంప్రదాయం ప్రకారం, మృతదేహాన్ని దహనం చేసిన మూడు రోజుల తర్వాత అస్థికలను బంధువులు తీసుకెళ్తుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అస్థికలను ఉంచి కలశాలు లాకర్లలో నిండిపోతున్నాయి. సాధారణంగా ఇక్కడ లాకర్లలో పదుల సంఖ్యలో అస్థికలు ఉండేవి. కానీ, ఇప్పుడు 150కు పైగా ఉంటున్నాయి. అందుకే, అస్థికలకు సంబంధించి బంధువులకు టోకెన్లు ఇచ్చి, వీలైనంత త్వరగా వచ్చి వాటిని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తు్న్నారు.