- అట్టహాసంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రవేశం
- ప్రత్యేకహోమం, వేదపండితుల మధ్య ఎమ్మెల్యే దంపతుల పూజలు
సామాజికసారథి, నాగర్ కర్నూల్: వేదమంత్రోచ్ఛరణలు, ప్రజల దీవెనలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎమ్మెల్యే ప్రజాభవన్ ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం శుభముహూర్తంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, డాక్టర్ సరిత దంపతులు క్యాంపు ఆఫీసులో ప్రత్యేకహోమం, పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. రైతులు, కూలీలు, యువకులు, మహిళలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తన క్యాంపు ఆఫీసులో, లేదా నేరుగా తనకు చెప్పుకోవచ్చని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.