Breaking News

అవసరమైతే మంత్రులను కలుస్తా..

అవసరమైతే మంత్రులను కలుస్తా..
  • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్​

సామాజిక సారథి, హైదరాబాద్: ఏపీలో థియేటర్ల సమస్య ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. బుధవారం తలసాని శ్రీనివాస్​యాదవ్​మీడియాతో మాట్లాడుతూ అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. తెలంగాణలో టికెట్‌ ధరలు పెంచాం. ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం. పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ హబ్‌గా ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని మంత్రి అన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందన్నారు. హైదరాబాద్‌ లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని, అందుకే తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదు, సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని అన్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫల యత్నాలుగానే మిగిలాయి. తాజాగా సినిమా టికెట్‌ రేట్ల విషయంపై ఆర్జీవీ కూడా పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆ మీటింగ్‌లో కూడా తేలిందేమీ లేదు. మరోవైపు ప్రభుత్వం వేసిన కమిటీ ఇచ్చే నివేదికపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో తలసాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.