సామాజిక సారథి, మెదక్ బ్యూరో: బ్యాంకర్ల సహకారం, అధికారులు, సెర్ప్ సిబ్బంది సమష్టి కృషివల్ల మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాలను అందించడంలో జిల్లా గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో (2023-24) బ్యాంక్ లింకేజి క్రింద 8,149 స్వయం సహాయక సంఘాలకు 491 కోట్ల 81 లక్షల ఆర్ధిక సహాయం అందించుటకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందని అందుకు గతంలో మాదిరే లక్షన్ని అధిగమించుటలో పూర్తి సహాకారం అందించవలసినదిగా కలెక్టర్ కోరారు. గురువారం ప్రజావాణి హాల్ లో జిల్లా గ్రామీణాభివుద్ది సంస్థ ఆధర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీకి సంబంధించి రూపొందించిన వార్షిక ప్రణాలికను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, డిఆర్ డిఓ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ అధికారి ఫిలిప్ తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరంలో 11,339 సంఘాలకు 584 కోట్ల 80 లక్షల బ్యాంక్ లింకేజీ ఇవ్వాలని లక్ష్యం కాగా 587 కోట్ల 80 లక్షలు అందించామన్నారు. ఆర్ధిక సంవత్సరం చివరలో ప్రభుత్వం లక్ష్యాన్ని మరో వంద కోట్లకు పెంచినందున లక్ష్యాన్ని అధిగమించుటకు మార్చి నెలాఖరువరకు శ్రమించవలసి వచ్చిందని అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం కూడా మధ్యలో లక్ష్యాన్ని పెంచే అవకాశాలుంటాయని, కాబట్టి గత సంవత్సరం లక్ష్యాన్నే నిర్దేశించుకొని వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష్యం అధిగమించేలా చక్కటి కార్యాచరణతో ముందుకెళ్లాలని బ్యాంకర్లకు సూచించారు. గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికా వేత్తలను ప్రోత్సహించాలని, ప్రాధాన్యత రంగాలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈసారి మహిళా సంఘ గ్రూపులకు 20 లక్షల వరకు బ్యాంకు లింకేజి ఇవ్వాలని కోరారు.
అనంతరం మంచి ప్రతిభకనబరచిన ఎపిజివిబి, ఎస్ బి ఐ, యూనియన్ బ్యాంకు, డిసిసిబి, యూకో బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ అధికారులను, ఏపీఎంను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు పీడీ భీమయ్య, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.
- May 19, 2023
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on బ్యాంకు లింకేజీ రుణాల్లో మెదక్ 4వ స్థానం