- ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల్
- మంత్రులు ఎర్రబెల్లి , వి.శ్రీనివాస్‌గౌడ్
- విగ్రహ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన
సామాజిక సారథి, హైదరాబాద్: ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణకు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కానుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని, రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని పేర్కొన్నారు. భారీ ఎత్తున నిర్మించి, త్వరలోనే భారత రాష్ట్రపతి, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్న రామానుజల వారి విగ్రహం మహిమాన్వితమైనదిగా నిలిచిపోతుందని అన్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ సమన్వయం, సహకారంతో అంతే గొప్పగా జరుగుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అతిరథ మహారథులు హాజరవుతారని అన్నారు. ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వచ్చే అహూతుల కోసం ఆ స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు తెలియజేశారు. అయితే జీయర్ ట్రస్ట్ ప్రాంగణంలో తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారని అభినందించారు. అలాగే సీఎం కేసీఆర్తెలంగాణలోని దేవాలయాల పునరుద్ధరణ, పూర్ణో ద్ధరణకు నడుం బిగించారని, యాదాద్రిని తీర్చిదిద్దుతున్న వైనాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు చినజీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.