Breaking News

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం
  • పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​

సామాజికసారథి, హైదరాబాద్‌: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషిచేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల పక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివలన అగ్రస్థానంలో నిలిచామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల కోసం పనిచేయడం, కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదన్నారు. తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం దక్కడం ఖాయమని ఈ దిశగా పని చేద్దామని కేటీఆర్‌ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.