న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రక్షణ శాఖకు పెద్దపీట వేసింది. సంబంధిత శాఖను బలోపేతం చేసేందుకు భారీగా కేటాయింపులు చేసింది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం, సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 15 ఏళ్లలో లేని విధంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. అయితే గతేడాది రూ.3.62 లక్షల కోట్లు కేటాయింపులు జరగ్గా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,78,195.62 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో లద్దాఖ్వంటి శీతల ప్రదేశాల్లో భద్రతాదళాలకు మరింత మెరుగైన వసతులు కల్పించనున్నారు. ఇదిలాఉండగా, బడ్జెట్లో కాటన్‌పై 10శాతం కస్టమ్స్ డ్యూటీ పెంపుతో దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అదే విధంగా లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వెర్టర్ల ధరలు పెరగనున్నాయి. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్ డ్యూటీ పెంపుతో కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35వేల కోట్లు కేటాయించడం చెప్పుకోదగిన విషయం.
మధ్యతరగతికి ధరాఘాతం
ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, చెప్పులు, పర్సులు, చార్జర్స్, సింథటిక్ జెమ్‌స్టోన్స్, లెదర్ ఉత్పత్తులు, సోలార్ ఇన్వర్టర్లు, సోలార్ లాంతర్లు, ఆటో విడిభాగాలు, స్టీలు స్క్రూలు, కాటన్, రా సిల్స్, యాన్ సిల్క్, ఆల్కహాలిక్ బెవెరెజెస్, క్రూడాయిల్, సోయాబిన్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆపిల్స్, బొగ్గు, లిగ్నైట్, పిట్, యూరియా తదితర ఫర్టిలైజర్లు, బఠాణీలు, కాబూలీ శనగలు, బెంగాల్ గ్రామ్, పప్పు దినుసుల ధరలు పెరగనున్నాయి. ఇదిలాఉండగా, ఐరన్, స్టీలు, నైలాన్ దుస్తులు, నైలాన్ ఫైబర్, కాపర్ వస్తువులు, బీమా, షూస్, బంగారం, వెండి ధరలు, నాప్తా.. తదితర వాటి ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆల్కాహాల్ బివరెజెస్‌పై కేంద్రప్రభుత్వం సెస్‌ను ప్రతిపాదించడంతో మద్యం ధరలు భారీగానే పెరగనున్నాయి.
బడ్జెట్ కేటాయింపులు
హోం మంత్రిత్వశాఖకు మొత్తంగా రూ.1,66,547 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1,33,690 కోట్లు కేటాయించగా, వ్యవసాయ, రైతుల సంక్షేమం కోసం రూ.1,31,531 కోట్లు కేటాయించారు. అలాగే రోడ్డు రవాణా, హైవేస్కోసం ఈ సారి బడ్జెట్లో రూ.1,18,101 కోట్లు కేటాయింపులు చేశారు. రైల్వేశాఖకు రూ.1,10,055 కోట్లు, విద్యాశాఖకు రూ.93,224 కోట్లు కేటాయించారు. ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకు రూ.73,932 కోట్లు, గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు రూ.54,581 కోట్లు, ప్రతిష్టాత్మక స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసం రూ.1,41,678 కోట్లు, మొట్టమొదటిసారి అమలు చేస్తున్న ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన పథకానికి రూ.64,180 కోట్లు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్ హైలెట్స్
– మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు
– రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు
– స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 3 వేల కోట్లు
–ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
–ఎలక్ట్రానిక్ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
–నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
–కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
–అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
– వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
–ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు
–ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు
–ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
–వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
–కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్
–రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
–కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
–రూ.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
–15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
–2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
–ఈ సంవత్సరమే ఎల్‌ఐసీ ఐపీవో
–మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
–మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్
– గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
–స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
–ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్‌థ భారత్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్
– రెగ్యులేటర్ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
–ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
–బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
– ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు
–1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
– రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
–రూ.18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
–వాహనరంగం వృద్ధి చర్యలు
–కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
–చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
–బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
–2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
–ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్కోస్ట్సరుకు రవాణా కారిడార్
– రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు.. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
–దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు
–జనగణనకు రూ.3,678 కోట్ల కేటాయింపు
–ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
–2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం.. 2025 నాటికి 4.8 శాతం టార్గెట్
–గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు