- వీడిన న్యాయవాది దంపతుల హత్యకేసు మిస్టరీ
- ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్
- హత్యకు వాడిన నలుపు రంగుకారు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఐజీ వి.నాగిరెడ్డి
సారథి న్యూస్, రామగుండం: మంథనికి సమీపంలో హైకోర్టు న్యాయవాదుల దంపతులు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిని దారుణంగా హతమార్చింది కుంట శ్రీనివాస్, అతని గ్యాంగేనని తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసిన పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను అరెస్ట్‌చేశారు. హత్యోదంతానికి సంబంధించిన వివరాలను గురువారం రాత్రి పెద్దపల్లిలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్ కుమార్‌తో కలిసి వరంగల్ జోన్ ఐజీ వి.నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈనెల 17న గట్టు వామన్ రావు, అతని భార్య పీవీ నాగమణి హైదరాబాద్‌నుంచి మంథని కోర్టుకు వచ్చారు. భార్యాభర్తలను చంపాలని ముందే ప్లాన్వేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లేటప్పుడు చంపాలని పథకం రచించి కుంట శ్రీనివాస్‌కు తోడుగా చిరంజీవి, కుమార్ వామన్ రావు దంపతుల కదలికలను పసిగట్టారు. కుంట శ్రీనివాస్‌కు బిట్టు శ్రీను తన కారుతో పాటు రెండు కొబ్బరి బొండం కొట్టే కత్తులను సమకూర్చాడు. చిరంజీవి కారు డ్రైవింగ్ చేస్తుండగా కుంట శ్రీను పక్కన కూర్చుని మంథని చౌరస్తాకు వచ్చారు. అదే సమయంలో వామన్ రావు తన భార్య పీవీ నాగమణితో కలిసి కారు(నంబర్ టీఎస్10 ఈజే 2828)లో పెద్దపెల్లి వైపునకు బయలుదేరారు.
సమాచారం ముందుగానే తెలుసుకుని వారి కన్నా ముందుగానే కుంట శ్రీనివాస్, చిరంజీవి రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామశివారులో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతంలో కారు కచ్చితంగా నెమ్మదిగా వెళ్తుందని కాపుగాశారు. వామన్ రావు కారు అక్కడికి రాగానే కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు ముందు అద్దంపై కొట్టడంతో భయపడి దిగి పారిపోయాడు. వామన్ రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారుని నడపడానికి ప్రయత్నం చేయగా కుంట శ్రీనివాస్ వామన్ రావును బయటికి లాగి అతనిపై కత్తితో దాడిచేశాడు. అదే సమయంలో చిరంజీవి రెండో పక్క నుంచి వచ్చి వామన్ రావు భార్య నాగమణిపై కత్తితో దాడిచేయడంతో ఆమె గాయాలతో కారు సీట్లోనే పడిపోయింది. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి తాను కూడా కత్తితో దాడిచేశాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు కొంతమంది వ్యక్తులు వీడియోతీశారు. రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావు తనపై దాడిచేసిన వ్యక్తి గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్, మరో వ్యక్తి ఉన్నాడని వాంగ్ములం ఇచ్చాడు.
ముంబైకి పారిపోతూ..
దాడి జరిగిన తర్వాత వెంటనే కుంట శ్రీనివాస్, చిరంజీవి వారు వచ్చిన నల్లరంగు బ్రీజాకార్ లోనే 8 ఇంక్లయిన్‌కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లి బట్టలు మార్చుకుని ఒక బ్యాగ్ లో ఉంచి, దాడికి ఉపయోగించిన కత్తులను రెండింటిని సుందిళ్ల బ్యారేజీ నీటిలో పడవేసి అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయారు. మహారాష్ట్ర నుంచి ముంబై వెళ్తుండగా వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సొంతూరులో వివాదాలే కారణం
వామన్‌రావుకు తన సొంత గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌తో ఐదేళ్లుగా వివాదాలు ఉన్నాయని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాలస్వామి ఆలయం మేనేజ్మెంట్ కమిటీ వివాదంతో పాటు ఇల్లు, కులదేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణాలు నిలిపివేయించారనే కక్షతోనే కుంట శ్రీను వామన్‌రావును చంపాలని కుట్ర పన్ని, బిట్టు శ్రీను సహకారంతో హత్యచేసినట్లు వివరించారు. కుంట శ్రీనివాస్ గతంలో నిషేధిత సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో పనిచేశాడని, బస్సు దహనం, 498ఏ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. చిరంజీవికి ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా, ఆర్థికంగా ఆదుకున్న కుంట శ్రీనివాస్ మీద అభిమానంతో ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ కారణాలు వెల్లడి కాలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హత్య సమయంలో ప్రయాణికులు తీసిన వీడియో క్లిప్పింగులు ఏవైనా ఉంటే తమకు పంపించాలని ఆయన కోరారు
టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ ఔట్
హైకోర్టు న్యాయవాది దంపతులు వామనరావు, నామమణి హత్య కేసులోని నిందితుడు కుంట శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ కొనసాగుతున్నాడు. న్యాయవాది దంపతుల హత్య కేసులో అతడు ఏ2గా ఉన్నారు. న్యాయవాది వామనరావు, కుంట శ్రీనివాస్‌లది మంథని మండలం గుంజపడుగు గ్రామంలో కొనసాగుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణం విషయంలో ఇద్దరి మధ్య వివాదాలే హత్యకు దారితీసినట్లు ప్రచారం జరుగుతోంది. గుడి నిర్మాణం కోసం కుంట శ్రీను పెద్దఎత్తున చందాలు వసూలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నాడని వామనరావు ఆరోపించారు. గుడిని ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మిస్తోందని వెల్లడిస్తూ.. ఆలయ నిర్మాణంపై ఆయన రిట్ ఫైల్ చేశారు. మరో రిట్ మంథని కోర్టులో కూడా ఫైల్ చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు గతకొద్డి నెలలుగా రాజుకున్నాయి. ఈ విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వామనరావు సోషల్ మీడియాలో పోస్టులు సైతం చేశారు. తమ గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్ తమపై దాడి చేశారని రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న వామనరావు చెప్పిన మాటలు, దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులకు ఈ కేసు విచారణకు, దాడిపై పలు అనుమానాలు కలుగకుండా వామనరావు చివరి మాటలు సాక్ష్యంగా మారాయి.