- లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వెళ్లొచ్చారు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సామాజికసారథి, హైదరాబాద్: మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందని, ఎప్పుడైనా జైలుకు వెళ్లకతప్పదని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బండి సంజయ్ తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రసాధన లక్ష్యాలకు భిన్నంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించాలన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ విషయం కేసీఆర్‌కు తెలిసిపోయిందని, అందుకే కమ్యూనిస్టుల తోను, ఇతర పార్టీల నేతలతో భేటీ అవుతున్నాడని విమర్శించారు. తేజస్వియాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పశుగ్రాసం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లొచ్చాడని, కేసీఆర్ కూడా జైలుకు వెళ్తే ఎలా ఉంటుందో తేజస్వియాదవ్ నిన్న ప్రగతి భవన్‌కు వచ్చి వివరించి ఉంటాడని ఎద్దేవాచేశారు. ‘ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. దోచుకోవడం దాచుకోవడమే కేసీఆర్ పని అని, కేసీఆర్‌ను ఎక్కడున్నా గుంజుకొచ్చి జైల్లో వేసుడే.. మరోవైపు 317 జీవో సవరించాలని బీజేపీ చేస్తున్న పోరాటాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు’ అని బండి సంజయ్ మండిపడ్డారు.