Breaking News

జోడో యాత్రకు.. పటిష్టమైన పోలీస్ బందోబస్తు

భారత్ జోడో యాత్రకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు
  • ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపు
  • వాహనదారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
  • ఎస్పీ రమణ కుమార్

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు బిహెచ్ఇఎల్ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై ఇక్రిశాట్, పటాన్ చెరువు మీదుగా ముత్తంగి వరకు సాగుతుందన్నారు. పాదయాత్రలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.  హైదరాబాద్ వెళ్ళే వాహనాలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ముత్తంగి ఓఆర్ఆర్ మీదుగా, సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు కంది చౌరస్తా మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందన్నారు. మూడవ తేదీన జోగిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను ఉదయం 6గంటల నుంచి గణపతి షుగర్ కంపెనీ వద్ద గల కొత్త బ్రిడ్జ్ ఎంఎన్ఆర్ ఆస్పత్రి, గణేష్ గడ్డ మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను మల్కాపూర్ చౌరస్తా నుంచి మల్లేపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని, ఐదవ తేదీన నారాయణఖేడ్ నుంచి జోగిపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలు సింగిల్ వేలో  వెళ్ళవలసి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా రోడ్డు మళ్ళించడం జరుగుతుందని ప్రజలు వాహనదారులు, పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.