- బీజేపీ నేతలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి
- ఓర్వలేకనే కేసీఆర్ పై విమర్శలు
- దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సామాజికసారథి, నిర్మల్: తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అడ్డగోలుగా మాట్లాడొద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. రైతుబంధు, రైతు బీమాతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను అరిగోస పెట్టిన మీకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన రెండు వేల కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందుతోందని, ప్రాజెక్టు అభివృద్ధి డిస్కవరీ ఛానల్ లో సైతం ప్రసారమైన విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని అన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి అనుమతిలేని దీక్ష చేపట్టిన బండి సంజయ్ పై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.