Breaking News

ప్రభుత్వానికి ‘జైభీమ్​ యూత్’​ విజ్ఞప్తి

ప్రభుత్వానికి ‘జైభీమ్​యూత్’​ విజ్ఞప్తి

సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్​వేవ్​తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్​సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్​రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్​ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్​ దందాపై ఉక్కుపాదం మోపాలని ఆయన కోరారు. రూ.2వేలకు అమ్మాల్సిన ఇంజక్షన్లను రూ.40వేల నుంచి రూ.50వేల వరకు బ్లాక్​మార్కెట్​లో అమ్ముతున్నారని, టాస్క్​ఫోర్స్​ దాడులు చేసి అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం నెలకొందని, వారంలో రోజుల వారీగా విధుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు, వైద్యసిబ్బంది, అంగన్ వాడీ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల స్థాయిలోనే కొవిడ్​19 నిర్ధారణ టెస్టులు చేసి బాధితులకు అక్కడే ఐసొలేషన్​సెంటర్లను ఏర్పాటుచేస్తే కొంతవరకు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గే అవకాశం ఉందని కోరారు. ప్రజలంతా ప్రాణభయంతో ఆస్పత్రులు, టెస్టింగ్​కేంద్రాలకు పరుగులు తీస్తున్నారని, అక్కడ రద్దీ పెరగడంతో కరోనా ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతుందని వివరించారు.

18+ వారికి వెంటనే వ్యాక్సినేషన్​ ప్రారంభించాలని, అవసరమైన వ్యాక్సిన్​ డోసులను కేంద్రప్రభుత్వం నుంచి తెప్పించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి డిమాండ్​చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్​ లైన్​ వారియర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్​ తో పాటు ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వీడకపోతే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.