Breaking News

అందరిలోనూ అభద్రతాభావం

అందరిలోనూ అభద్రతాభావం
  • గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర
  • కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ
  • కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవంలో అపశ్రుతి

న్యూఢిల్లీ: దేశంలోని గంగాజమున సంస్కృతిని రూపుమాపే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్​అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. అందరిలోనూ భయం ఉన్నదని, సాధారణ పౌరుడు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. మంగళవారం కాంగ్రెస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ ప్రయాణం.. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదర్శాలు, విలువలు, సూత్రాలకు మరోసారి తమల్ని తాము పునరంకితం చేసుకుంటామన్నామని సోనియాగాంధీ అన్నారు.

జెండా ఎగరవేస్తుండగా అపశ్రుతి

కాంగ్రెస్‌ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియాగాంధీ పార్టీ జెండాను ఎగరవేస్తుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జెండా ఎగరవేసే తాడు చిక్కుకుపోయింది. దీంతో అక్కడున్న సిబ్బంది వచ్చి.. జెండాను బలంగా లాగే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా పైన ఎగరాల్సిన కాంగ్రెస్‌ జెండా ఊడి వచ్చి సోనియా గాంధీ చేతుల్లో పడింది. దీంతో ఆ జెండాను ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత చేతులతో పార్టీ జెండాను పట్టుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం చూసి అక్కడున్న వారంతా తెల్లమోహం వేశారు. కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీలో పాటు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.