Breaking News

బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

బాలుడిని చికిత్స కోసం తీసుకెళ్తే..

  • ఆర్ఎంపీ వచ్చీరాని ట్రీట్​మెంట్​
  • పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి
  • తల్లిదండ్రులతో గోప్యంగా బేరం

సామాజిక సారథి, బిజినేపల్లి: వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందిన సంఘటన విషాదకర సంఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని ఓ గిరిజన తండాలో గురువారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తండాకు చెందిన బాలుడు(11) మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బిజినేపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వైద్యం కోసం తీసుకెళ్లారు. అతను వచ్చీరాని వైద్యంతో సదరు బాలుడికి సెలైన్​ ఎక్కించాడు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి విషమించడంతో సదరు ఆర్ఎంపీ సూచన మేరకు తల్లిదండ్రులు నాగర్​కర్నూల్​కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్​నగర్​కు హుటాహుటిన తీసుకెళ్లారు. బాలుడికి మరింత సీరియస్​గా ఉండటంతో హైదరాబాద్​కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మార్గమధ్యంలోనే చనిపోయాడు. చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులు ఆర్ఎంపీ వద్దకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. ‘ఎంత పనిచేశావ్’​ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. తాను చేసిన వైద్యం కొద్దిగా పొరపాటు జరిగిందని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సదరు ఆర్ఎంపీ విషయం బయటికి పొక్కకుండా బేరం కుదుర్చుకున్నట్లు స్థానికంగా ప్రచారం సాగింది. ఈ తతంగమంతా జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ​క్లినిక్​లో జరగడం గమనార్హం.