- వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల
సామాజికసారథి, హైదరాబాద్: ఏపీలో పార్టీపై ఏర్పాటుపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని, అదే విషయం తాను చెప్పానని తెలిపారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందన్నారు. వైఎస్సార్‌ను ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే వైఎస్సార్టీపీ పుట్టిందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. అధికారంలో ఉంటాననుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనివారు.. అధికారంలోకి రారనుకోకూడదని, పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్ ఉంటాయని షర్మిల వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. ధరణిలో భూములు గల్లంతు చేశారని ఆరోపించారు. మూడులక్షల మందికి రుణమాఫీ ఇచ్చి.. 30 లక్షల మందికి ఎగ్గొట్టారని తెలిపారు. అన్ని బంద్‌లు బంద్ పెట్టి రైతుబంధు ఇస్తున్నారని తప్పుబట్టారు. రైతుల ధాన్యంపై తాలు తరుగు అంటూ అన్నీ కటింగ్‌లేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు పాలన చేతకాదని ఎద్దేవాచేశారు. ఆయన ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రైతుల ఆత్మహత్యలు కనపడడం లేదా? అని షర్మిల ప్రశ్నించారు. ఇష్యూ డైవర్ట్ కోసమే బీజేపీ దీక్షలు, ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. 317 జీవో పేరుతో బీజేపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పారు. వరి ధాన్యం మొత్తం కొనాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు.