- పొడు భూముల్లో సాగును అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు
- కాళ్లావేళ్ల మొక్కినా కనికరించని ఆఫీసర్లు
- పురుగు మందు తాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
- నాగర్ కర్నూల్జిల్లా ముక్కిడిగుండంలో ఉద్రిక్తత
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: పోడు భూములు పంటలు వేసుకునేందుకు సిద్ధమవుతున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం గ్రామంలో పొడు రైతులు భూములు పంటలను సాగుచేసుకుంటుండగా బుధవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. రాష్ట్రప్రభుత్వం పోడు రైతులకు హక్కులు కల్పిస్తామని ఒకవైపు చెబుతున్న మరోవైపు ఇలా అటవీశాఖ అధికారులు ఏటా పంటలు వేసుకోకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. రాజకీయ నాయకులకు తమ సమస్యలు పట్టడం లేదని పోడు భూములకు పట్టాలు ఇచ్చే అంశం ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు అటవీశాఖ అధికారులతో వాగ్వాదం జరుగుతుండగానే వారిలో ఓ మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కొల్లాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధిత మహిళా రైతులు మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామని, కావాలనే ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది. పలు సందర్భాల్లో తమపై దాడులు చేసిన సంఘటనలూ ఉన్నాయని, పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్న ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.