Breaking News

అడవుల రక్షణ అందరి బాధ్యత

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మియావాకి ప్లాంటేషన్ ను శుక్రవారం కలెక్టర్ ఎల్.శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచేలా జపాన్‌ మియావాకీ పద్ధతిలో నాటడం ద్వారా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానంతో ప్రతి పట్టణ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో నాటి చిట్టడవులను అభివృద్ధి చేయాలన్నారు. హరిత తెలంగాణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, పచ్చదనం పెంపు ద్వారా అందరి జీవన విధానం మెరుగుపడుతుందని కలెక్టర్ వివరించారు. సాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపట్టాలన్నారు. అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి, సహజ అటవీ పురుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. రంగాపూర్ మియావాకి ప్లాంటేషన్ లో పెంచుతున్న మొక్కల వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎకరాలో 25 రకాల పండ్లు, పూలు ఇతర మొక్కలతో ఐదువేల మొక్కలను ఏడాది కింద ప్లాంటేషన్ చేసినట్లు డీఎఫ్ వో కిష్టగౌడ్ కలెక్టర్ కు వివరించారు. ప్రకృతి రమణీయంగా ప్లాంటేషన్ ను తీర్చిదిద్దన విధానం చాలా బాగుందని కలెక్టర్ ప్రశంసించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్, ఆర్డీవో పాండు నాయక్, అటవీశాఖ అధికారులు ఉన్నారు.