- ఎంపీ బండి సంజయ్ కార్యాలయాన్ని.. సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు ఎందుకు దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్ కార్యాలయాన్ని కిషన్‌రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. జీవో317ను రద్దుచేయాలని డిమాండ్‌చేస్తూ బండి సంజయ్చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఆయనను అరెస్ట్‌చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డోర్లు, తలుపులను విరగ్గొట్టి ఆయనను తీసుకెళ్లారు. దీంతో ధ్వంసమైన డోర్లు, ఫర్నీచర్, సామగ్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫీస్ అద్దాలు ధ్వంసం, సీసీ పుటేజీ ఎత్తుకుపోవడమేమిటని నిలదీశారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎంపీ ఆఫీస్‌లోకి రావడానికి పోలీసులకు ఏం అధికారం ఉందన్నారు. ప్రజాసమస్యలపై సంజయ్ దీక్ష చేస్తే పోలీసులు అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ ఆఫీస్‌ను యుద్ధభూమిగా మార్చారని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి సంజయ్‌ని జైలుకు పంపారని మండిపడ్డారు. కొవిడ్ నిబంధనల సాకుతో తప్పుడు పెట్టి వేధిస్తున్నారన్నారు. కొవిడ్ నిబంధనలు బీజేపీ ఆఫీస్‌కు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. విూ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జైలులో పరామర్శించారు. జాగరణ దీక్షణ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి నిర్భందం, నియంతృత్వం చూడలేదని, కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ సమాజం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్తదితరులు ఉన్నారు.