- హుజురాబాద్ లో ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కట్టలేదు..
- టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ
- జమ్మికుంట బహిరంగ సభలో మంత్రి టి.హరీశ్ రావు
- టీఆర్ఎస్ లో చేరిన సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు
సామాజిక సారథి, హుజురాబాద్: రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గాలకు నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నా పూర్తిచేయలేకపోయారని విమర్శించారు. మిగతా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలు చేస్తుంటే హుజురాబాద్ లో మాత్రం ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేదన్నారు. జమ్మికుంటలో సీపీఐ నేత కాయిత లింగారెడ్డి, టీడీపీ నేత అప్పాల మధు, ఏఐటీయూసీ నాయకుడు దమ్ముల రామ్మూర్తి, వందలాది మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గానికి గెల్లు శ్రీనివాస్ రూపంలో ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డి రూపంలో ఎమ్మెల్సీ డబుల్ ధమాకా అన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, అసలు ఇక్కడ కాంగ్రెస్ ఉందా? వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీకి ఓటు వేస్తే పెంచిన డీజిల్ ధరలు, మార్కెట్ యార్డుల రద్దుకు మనం ఒప్పుకున్నట్లేనని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్, ఆసరా పింఛన్లు వంటి ఎన్నింటినో పేదల కోసం సీఎం కేసీఆర్ తెచ్చారని కొనియాడారు. మాట మాట్లాడితే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అంటున్నారని, ఏడేళ్ల క్రితం మంజూరుచేసిన ఇళ్లను కట్టించి ఉంటే నాలుగువేల మంది ఆత్మగౌరవంతో బతికేవారు కాదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఇండ్లు కట్టగలడా? అని మంత్రి హరీ శ్రావు అన్నారు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రెండేళ్లలో ఒక్క లక్ష రూపాయల పనైనా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా బండి సంజయ్ చేయని పనులు అదే పార్టీ నుంచి ఈటల రాజేందర్ గెలిస్తే ఏం చేయగలడని నిలదీశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆస్పత్రులు కడుతుంటే.. బీజేపీ వాళ్లేమో అమ్ముతున్నారని విమర్శించారు. ఇక్కడ పోటీ రూపాయి విలువ చేసే బొట్టు బిళ్లలకు, లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి పథకానికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలని, పనిచేసేవారు గెలవాలని చెప్పారు. 9 నెలల క్రితం దుబ్బాకలో గెలిచినాయన ఏంచేశాడని, ఆయన కూడా గెలవకముందు ఎన్నో చెప్పాడని గుర్తుచేశారు.
పసుపు బోర్డు ఏమైంది?
రైలు తెస్తా, అది తెస్తా, ఇది తెస్తా అంటూ చెప్పిన ఆయన నోటికే మొక్కాలని, ఏవోవో చెప్పినా ఒక్కటీ రాలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని నిజామాబాద్ ఎంపీ బాండ్ పేపర్ రాయించి ఇచ్చాడని, రెండేళ్లయింది ఏమైందని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఇక్కడ ఇల్లులేని వారందరికీ సొంత స్థలాల్లో కట్టుకునేందుకు సాయం చేస్తామని ప్రకటించారు.
ధరల పాపం బీజేపీదే..
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి, రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చి బీజేపీ దేశానికి గొడ్డలిపెట్టుగా మారిందని విమర్శించారు. ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు వ్యతిరేకమని, అలాంటి పార్టీలో ఈటల చేరాడని గుర్తుచేశారు. మనిషిగా ఉన్న ఈటలను సీఎం కేసీఆర్ చాలా పెద్దగా చేసిండని, గెల్లు గెలిపిస్తే ఆయన పెద్దగా ఎదిగి మీకు విశేషసేవలు అందిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఈటల ఒక వ్యక్తిగానే వెళ్లిపోయారే తప్ప, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరు కూడా ఆయన వెంట లేరన్నారు. అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులంతా మన వెంటే ఉన్నారని మంత్రి అన్నారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ పొరపాటున ఇక్కడ గెలిస్తే హూజూరాబాద్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.