Breaking News

కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

సామాజిక సారథి, మెదక్ బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమం మనఇంటికే వెలుగు లాంటిదని, కంటిచూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో 79 రోజుల నుండి నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నదని, ఇదే స్ఫూర్తితో జూన్ 15 వరకు కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గురువారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో కంటి వెలుగు శిబిరాన్ని, నర్సరీని, సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, నర్సాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, పెద్ద చింత కుంట లో రైస్ మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. శిబిరాలలో మొబిలైజేషన్ కూడా బాగుందని అన్నారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును, రికార్డులను, కంటి అద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ రీడింగ్ అద్దాలు స్టాక్ లో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 415 జిపిలు, 73 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించి 4,17,365 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 44,308 మందికి రీడింగ్ అద్దాలు, 34,093 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని, మరో 11,707 మందికి త్వరలో అందజేయనున్నామని అన్నారు. కాగా ఇప్పటి వరకు నేత్ర పరీక్షలుచేసుకున్నవారిలో 3,27,240 మందికి ఎటువంటి సమస్యలు లేవని నిర్దారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అనంతరం వైకుంఠ ధామాన్ని పరిశీలించి బోర్ పంపు సెట్ కు వెంటనే విద్యుత్ సౌకర్యం కలిగించి వాడుకలోకి తేవాలని సూచించారు. డంప్ యార్డ్ ను పరిశీలించి తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు పొడిచెత్తను ఎరువుగా విక్రయించి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలన్నారు.